James 5

ధనికులకు హెచ్చరిక

1ధనవంతులారా, మీ మీదికి వచ్చే దుర్దశను తలచుకుని శోకించండి. 2మీ సిరిసంపదలు శిథిలమైపోయాయి. మీ బట్టలు చిమ్మెటలు కొట్టేస్తున్నాయి. 3మీ వెండి బంగారాలు తుప్పుపట్టాయి. ఆ తుప్పే మీమీద సాక్ష్యం పలుకుతూ అగ్నిలాగా మీ దేహాలను దహిస్తుంది. మీరు చివరిదినాల్లో ధనం పోగు చేసుకున్నారు.

4మీ చేను కోసిన పనివారికి సమయానికి ఇవ్వకుండా, మీరు మోసంగా బిగపట్టిన కూలీ కేకలు వేస్తున్నది. మీ కోతపని వారి ఆక్రందనలు సేనల ప్రభువు చెవిని బడుతున్నాయి. 5మీరు భూమి మీద సుఖంగా బతుకుతూ భోగలాలసులై వధ దినం కోసం మీ హృదయాలను కొవ్వబెట్టుకున్నారు. 6మిమ్మల్ని ఎదిరించలేని నీతిపరులకు మీరు శిక్ష విధించి చంపారు.

ప్రభువు రాకడను పురస్కరించుకుని హెచ్చరికలు

7కాబట్టి సోదరులారా, ప్రభువు రాక వరకూ ఓపికగా ఉండండి. రైతు తొలకరి వాన, కడవరి వాన కురిసే దాకా విలువైన పంట కోసం ఓపికతో ఎదురు చూస్తూ వేచి ఉంటాడు కదా. 8ప్రభువు రాక దగ్గర పడింది. మీరు కూడా ఓపికగా ఉండండి. మీ హృదయాలను దిటవు చేసుకోండి.

9సోదరులారా, ఒకడి మీద ఒకడు సణుక్కోకండి, అప్పుడు మీ మీదికి తీర్పు రాదు. ఇదుగో న్యాయాధిపతి వాకిట్లోకి వచ్చేశాడు. 10నా సోదరులారా, ప్రభువు నామంలో బోధించిన ప్రవక్తలు ఎదుర్కొన్న హింసలను, ఓపికను ఆదర్శంగా తీసుకోండి. 11సహించి నిలబడిన వారిని ధన్యులని భావిస్తాము గదా? మీరు యోబు సహనాన్ని గూర్చి విన్నారు. యోబు విషయంలో దేవుని ఉద్దేశాలను తెలిసిన మీరు ఆయన ఎంతో జాలి, కరుణ ఉన్నవాడని గ్రహించారు.

12నా సోదరులారా, ఒక ముఖ్యమైన సంగతి. ఆకాశం తోడనీ భూమి తోడనీ మరి దేని తోడనీ ఒట్టు పెట్టుకోవద్దు. మీరు “అవునంటే అవును, కాదంటే కాదు” అన్నట్టుగా ఉంటే మీరు తీర్పు పాలు కారు.

13మీలో ఎవరికైనా కష్టం వస్తే అతడు ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగితే అతడు కీర్తనలు పాడాలి. 14మీలో ఎవరైనా జబ్బు పడ్డాడా? అతడు సంఘ పెద్దలను పిలిపించుకోవాలి, వారు ప్రభువు నామంలో అతనికి నూనె రాసి అతని కోసం ప్రార్థన చేయాలి. 15విశ్వాసంతో కూడిన ప్రార్థన ఆ రోగిని బాగు చేస్తుంది. ప్రభువు అతణ్ణి లేపుతాడు, అతడు పాపం చేసి ఉంటే అతనికి పాపక్షమాపణ దొరుకుతుంది.

16కాబట్టి మీ పాపాలను ఒకరితో ఒకడు ఒప్పుకోండి. ఒకడి కోసం ఒకడు ప్రార్థన చేయండి. అప్పుడు మీకు స్వస్థత కలగవచ్చు. నీతిమంతుని విజ్ఞాపన ఫలభరితమైనది. అది ఎంతో బలవత్తరమైనది. 17ఏలీయా మనలాటి స్వభావం ఉన్న మనిషే. వానలు కురవకుండా అతడు తీవ్రంగా ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరాలు భూమి మీద వాన కురవలేదు. 18అతడు తిరిగి ప్రార్థన చేస్తే ఆకాశం వాన కురిపించింది, భూమి ఫలసాయం ఇచ్చింది.

19నా సోదరులారా, మీలో ఎవరైనా సత్యం నుంచి తొలగిపోతే మరొకడు అతన్ని తిరిగి సత్యానికి మళ్ళించినట్టయితే 20అలాటి పాపిని తన తప్పుమార్గం నుంచి మళ్ళించే వాడు మరణం నుంచి ఒక ఆత్మను రక్షించి అనేక పాపాలను కప్పివేస్తాడని అతడు తెలుసుకోవాలి.

Copyright information for TelULB